ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటి నుండే వాడి వేడిగా మారాయి. అబ్దుల్ కలాం సంతాప తీర్మానం, గోదావరి పుష్కరాల తొక్కిసలాట మృతులకు నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన అసెంబ్లీని ప్రతిపక్ష నేత జగన్ తన వాడి మాటలతో వేడెక్కించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యలు ప్రత్యేక హోదా కోసం కాదని... వారంతా చంద్రబాబు నాయుడు. బీజేపీ మంత్రులు ఇస్తున్న స్టేట్ మెంట్ల పై నమ్మకం లేకే చనిపోతున్నారని జగన్ ఆరోపించారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.
అన్యాయమని అనుకున్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఎంపీగా నువ్వు ఏంచేశావని సూటిగా ప్రశ్నించారు. తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నావంటూ జగన్ నుద్దేశించి ఎద్దేవా చేశారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ర్టానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే అప్పుడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తామంతా కలిసి ప్రత్యేకం కోసం ఎవరూ బలి కావొద్దని చెప్పటంతోపాటు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పుకోచ్చారు. అనంతరం వైసీపీ సభ్యులు పోడియంను చుట్టి గందరగోళం సృష్టించగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. మొదటి రోజే సభ ఇలా కావటంతో ఇక మిగతా రోజుల సంగతి కూడా ఇంతే అని అర్థమవుతోంది.