ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సీమకు తాను అన్యాయం చేస్తున్నారంటూ కొందరు తనపై దుష్ప్రచారం చేయటంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉండగా సీమకు అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. అసలు సీమ వెనుకబాటుకు స్థానిక నేతలే కారణమని దుయ్యబట్టారు. ఈరోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ... తాను రాయలసీమకు చెందిన వాడిని కాదా? అని ప్రశ్నించారు.
కొందరు కావాలనే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వపరంగా తప్పులుంటే సరిచేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ పలువురు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీఎం ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే తాను ఇక్కడే మకాం వేస్తానన్నారు. అవసరమైతే బస్సులో పడుకుని తిష్ట వేస్తానని చెప్పారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ప్ర్యతేక పార్టీ పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.