బీజేపీ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలవటంతో ఇప్పుడు పాకిస్థాన్ పండగ చేస్కుంటుంది. అదేంటీ... ఇక్కడెక్కడో ఇండియాలోని బీహార్ ఎన్నికల ఫలితాల వల్ల పాకిస్థాన్ కి లాభమేంటనుకుంటున్నారా? అక్కడ అంతే మరి. భారత్ కు సంబంధించి ఇటువంటి వార్తలకు ముందుగా స్పందించేది ఆ దేశమే. ముఖ్యంగా మోదీ పట్ల ఏ మాత్రం సానుకూలత లేని ఆ దేశం తన వ్యతిరేకతను చూపింది. భారత్ మీద ఉన్న అక్కసును ఈరకంగా వెల్లగక్కింది. బీహార్ ఫలితాలు వెల్లడయ్యాక దేశవ్యాప్తంగా బాణాసంచాల మోతతో ఆ దేశం దద్దరిల్లింది. ఇక సోషల్ మీడియా ట్విట్టర్లో అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు ట్రెండ్ సెట్ చేసిందట. కొన్ని కామెంట్లయితే మరీ మితిమీరిపోయాయని తెలుస్తోంది.
ఇక మోదీ నేతృత్వంలోని బీజేపీ ఓటమిపాలు కావడం గత కొన్ని నెలల్లో ఆ దేశం విన్న శుభవార్తల్లో ఒకటట. ఈ విషయాన్ని ఆ దేశపు పత్రిక 'ది న్యూస్ ఇంటర్నేషనల్' తన సంపాదకీయంలో పేర్కొంది. రాజకీయాలను ప్రేరేపితం చేస్తూ, ప్రజల్లో మతాన్ని రెచ్చగొట్టడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండవని బీజేపీకి ఈ ఫలితాలతో తెలిసొస్తుందని పేర్కొంది. మోదీ వచ్చిన తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయని, కాశ్మీరులో హింస పెరగడం, సరిహద్దుల్లో కాల్పులు, ముస్లింల హత్యలు, బీఫ్ ఉదయం, పాక్ గాయకుల పట్ల వ్యతిరేకత వంటి అంశాలు ఇందుకు కారణమని వెల్లడించింది.
వచ్చే నాలుగేళ్లలో విపక్షాలు పాటించాల్సిన వ్యూహాలు ఎలా వుండాలన్న విషయమై ఈ ఎన్నికలు దిశానిర్దేశం చేశాయని అభిప్రాయపడింది. ఈ ఎన్నికలతో మోదీపై ఆ పార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలూ తొలగిపోయాయని ఆ సంపాదకీయంలో పేర్కొంది.