కేసీఆర్ మాటకు బాబు విలువ ఇస్తారా?

April 18, 2016 | 10:59 AM | 2 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-naidu-badrachalam-merged-mandals-telangana-niharonline

విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టు పోలవరం ఏపీ పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న తెలంగాణలోని ఏడు మండలాలు కూడా ఏపీలో కలిసిపోయాయి. అప్పటిదాకా ఖమ్మం జిల్లా కింద ఉన్న ఈ ఏడు మండలాలు ఆ తర్వాత ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విలీనమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా భద్రాచలం పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటన చేశారు. సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనకు హామీ ఇచ్చారని కూడా ఆయన పేర్కొన్నారు.

                                ఈ విషయంపై ఇరు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించినప్పటికీ,  చంద్రబాబు మాత్రం ఖండించలేదు. అంతేకాకుండా కేసీఆర్ వ్యాఖ్యలను చంద్రబాబు స్వాగతించారు కూడా. మరికాసేపట్లో విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేసీఆర్ కోరినట్లు సదరు ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కాస్తంత గుర్రుగా ఉన్న దేవినేని ఉమా, మరికొంత మంది మంత్రులు చంద్రబాబు యత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు. అయితే పార్టీ అధినేత, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నిర్ణయాన్ని దేవినేని సహా ఇతర మంత్రులెవ్వరు కూడా వ్యతిరేకించే అవకాశాలే లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోరినట్లుగా ఐదు గ్రామాలు తెలంగాణకు బదలాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అటు ఏపీలోనే కాక ఇటు తెలంగాణలోనూ ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ