ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు ఈ అంశం మీదే నడుస్తుందన్న విషయం సామాన్యజనీకానికి పెద్ద అర్థం కానీ విషయం కాదు. అధికార పక్షం టీడీపీతోపాటు ప్రతిపక్ష వైకపా లో కూడా కుల సమీకరణల మీదే నడుస్తున్నాయి కూడా. పార్టీ యే జీవితంగా, అధిష్టానమే శిరోధారంగా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నవారికంటే, తమ కులపోళ్లు అన్న సెంటిమెంట్ తో పనిచెయ్యటం అక్కడ పరిపాటిగా మారింది. దీనికి చెక్ పెట్టే అంశం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే నవ్యాంధ్ర.
ఏపీలో ఈ రెండు పార్టీలకు పోటీనివ్వటానికి ఓ కొత్త పార్టీ రూపుదిద్దుకోనుంది. దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు దీనికి ఆద్యుడు కానున్నాడు. ఆ రెండు పార్టీల్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి అంతగా ప్రాధాన్యం దక్కదని కూడా ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయా వర్గాల జనాభా ప్రతిపాదికన న్యాయం చేయాలంటే కొత్త పార్టీ పెట్టాల్సిందేనని పద్మారావు పేర్కొన్నారు. ఆ పనిని తానే చేస్తున్నానని ఆయన మంగళవారం ప్రకటించారు.
వచ్చే నెల 1న ‘నవ్యాంధ్ర’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. తాను ఏర్పాటు చేస్తున్న పార్టీలో ఆయా సామాజికవర్గాలకు వారి జనాభా దామాషా పద్ధతిన సీట్లను కేటాయిస్తామని పద్మారావు ప్రకటించారు. పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకొస్తున్న ఈ టైంలో దీనికి మనుగడ ఉంటుందా? శక్తివంతమైన ఆ కుల పార్టీల ముందు ఇది రాణించగలదా? అసలు ఆ పార్టీని ప్రజలు సీరియస్ గా తీస్కుంటారో... లేక లైట్ తీస్కుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి.