విభజన ఎప్పుడయితే పూర్తయ్యిందో అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయింది. ఇచ్చామన్న ఆనందం తెలంగాణలో, అసలు ఉనికే లేకుండా ఏపీలో పార్టీ దిగజారియింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి అతి గతి లేదు. మరి అలాంటి టైంలో పార్టీ శ్రేణులు చెయ్యాల్సిందేంటి? అధికార పక్షంపై విమర్శల కన్నా పార్టీ క్యాడర్ ను కాపాడుకోవటంపైనే ఎక్కువ దృష్టిసారించాలి. అదే టైంలో ప్రజల్లో పార్టీ పై నమ్మకాన్ని కాస్తలో కాస్తైనా పెంచేలా చెయ్యాలి. అసలు అది జరుగుతుందా మరి!
కీలకమైన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ కొత్త ఉద్యమం చేపట్టింది. అదే 'కోటి ఎస్ఎంఎస్ ల ఉద్యమం'. ఈ ఉద్యమాన్ని ఈ నెల 23 నుంచి విశాఖపట్నంలో ప్రారంభిస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో రాష్ట్రంలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతలతో రఘువీరా సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఎస్ఎంఎస్ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఉద్యమంపై జిల్లా నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి వెంటనే హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు ఎస్ఎంఎస్ లు ఇస్తామని రఘువీరా చెప్పారు.
అధికారం పోయింది. కేంద్రంతో సత్ససంబంధాలు లేవు. ఇక్కడి ప్రభుత్వం అస్సలు పట్టించుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎన్ని చేసినా వేస్టే. అది గుర్తించి ఈ ఫీట్లు మానుకుని పార్టీ మనుగడ కోసం ప్రయత్నిస్తే మంచింది. పెద్ద తలలన్నీ ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయ్. కనీసం ఉన్నవాటినైనా కాపాడుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.