పవన్ భక్త కళ్యాణ్ తన వాక్ స్వాతంత్ర్యపు హక్కును వినియోగించుకున్న సందర్భంలో ఇటు టీడీపీలోనూ అటు టీఆర్ఎస్ లోనూ రంధ్రాన్వేషణ మొదలైంది. హరీష్ రావు మొదలు టీఆర్ఎస్ లాయర్ల వరకు ప్రస్తుత వానాకాలపు ఎండల్ని తలపిస్తున్నారు. పోనీలే... మనోడే, అనగా మన గడ్డపోడేగా అనగా మన గడ్డకు చెందిన అప్ కమింగ్ రాజకీయ కళాకారుడేగా అని సరిపెట్టుకుంటున్నారా టీడీపీ బేహారులు. నీతిగా కూడా యాపారాలు చేసుకోవద్దా అని సౌజన్యారావు, సీమాంధ్ర పరువు ప్రతిష్టలను కేసీఆర్ పాదాల వద్ద తాకట్టు పెట్టేసాడని నాని బాబు, మధ్యలో మనకెందుకనుకోకుండా మార్కిస్ట్ రాఘవ తనకు తోచిన సలహా ఒకటి ఎసిరేడు. తన కంటె కొంచెం బొద్దుగా ఉంటాడన్న దుగ్ధ ఏమో మరి ప్రత్యేక హోదా వంకతో నిరాహార దీక్ష చెయ్యవయ్యా కళ్యాణం అని ఘట్టిగానే చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో ఓ డజను కేజీలు తగ్గితే నీరసంగా పడి ఉంటాడని! అంతర్యుద్ధాల్లాంటి గంభీరమైన పదప్రయోగాలు చేసిన పాపానికి అందరూ ఏకమై చంటోడ్ని ఉతికి ఆరేస్తున్నారు. యూరోపియన్ హిస్టరీ వగైరాలు ఫాంహౌస్ లో తీరిగ్గా కూర్చుని బట్టీ పడితే జరిగే అనర్థాలవే మరి! సందర్భ శుద్ధి చూస్కోవాలి మరి. ఏదీ ఏమైనప్పటికీ ప్రత్యేక హోదా విషయాన్ని బాగా ఫోకస్ చేసి వేడెక్కించిన కీర్తి ప్రతిష్ఠలు చిరంజీవి కొణిదెల పవన్ కళ్యాణ్ బాబుదే అని ఒప్పుకోవాలి. జై జనసేన... జై హిందు!