యాక్సిడెంట్స్... ప్రమాదాలు అనేవి ఎంతటి శాడిస్టు స్వభావులకైనా రుచించవు అనేది నిర్వివాదాంశం. అంతెందుగ్గానీ యాక్సిడెంట్లుని ఎవరూ కోరుకోరు, పైగా కావాలని దాన్లో ఇరుక్కోవడానికి ఇష్టపడరు. కావాలని ఎవ్వరూ కూడా యాక్సిడెంటు చెయ్యరు గాక చెయ్యరు. ప్రమాదానికి గురయిన వారి గురించి అప్రయత్నంగానే మనం అయ్యో రామా అని స్పందిస్తాం.
డ్రీమ్ గర్ల్ అని పిలుచుకుంటూ దేశం అంతా బ్రహ్మరథం పట్టిన హేమా మాలిని రీసెంటుగా రోడ్డు ప్రమాదంలో ఇరుక్కుంది. కనుబొమ్మపై భాగంలో ఓ మోస్తరుగా గాయమై రక్త కళ్లజూసింది. అంతవరకూ నయమే మరి, ఈ స్వప్నసుందరి బెంజి కారును పరామర్శించిన అవతల కారులో ఉన్న వారి పరిస్థితి... రెండేళ్ల పాప చనిపోయింది. తండ్రి కాలు విరిగి, నడుం దెబ్బతిని దీనమైన పరిస్థితిలో హాస్పిటల్ లో పడి ఉన్నాడు. దయగల ఆస్పత్రి ప్రభువులు బిల్లు విషయంలో నిష్కర్షగా ఉండి క్షతగాత్రుణ్ణి బయటకు నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన మొదటి దశలో అవతల వారిని అన్ని విధాలా ఆదుకుంటానని ప్రకటించి ఎంత మంచిదో అనిపించుకున్న ఈ లతాంగి మాటమార్చింది. మా డ్రవయిర్ దేం తప్పులేదు. అవతల కారు ఓనర్ ఖండేల్ వాల్ బృందానిదే తప్పు అని రక్షించుకునే ప్రయత్నం చేస్తుండటంతో అందరికీ వెగటనిపిస్తోంది. అందమైన ముఖం వెనుక ఇంత రాక్షసత్వమా అని ఛీకొడుతున్నారు అందరూ.
తాను సంపాదించుకుంది... పెనిమిటి సంపాదించి పెట్టేడు. ఆడ, మగ సంతానం అంతా సంపాదనపరులే... పైగా అధికార పార్టీ పార్లమెంటు మెంబరు. జరిగిందానికి మానవత్వపు పరిమళం పూయకపోగా, తప్పెవరిది అనే మిమాంస ఎంతవరకు సబబు?...పోయేకాలం!