తండ్రి అడుగుజాడల్లో తనయుడు. పెద్దాయనకు ప్రధాని అయ్యే లక్షణాలు ఉంటే, చిన్నోడు సీఎంగా బాగానే పేరు తెచ్చుకుంటున్నాడు. నిన్నటి దాకా ఆ ఇద్దరిని చూసి దేశం మొత్తం అనుకుంది. అయితే ఇదీ భవిష్యత్తులో కొనసాగే పరిస్థితులు లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ములాయం అఖిలేష్ మధ్య జరగుతున్న వార్. గడచిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ముమ్మర ప్రచారం సాగించిన అఖిలేశ్, సొంత పార్టీ కార్యకర్తల నుంచే కాక ఓటర్ల నుంచి కాబోయే సీఎంగా చప్పట్లు కొట్టించుకున్నారు. అంతేనా, ఈ దఫా మీ తనయుడిని అధికార పీఠమెక్కించండి అంటూ బహిరంగ సభల్లోనే జనం ములాయం సింగ్ యాదవ్ కు చెప్పారు. జనాభిప్రాయానికి తలొగ్గిన యులాయం, కొడుకును సీఎం పీఠమెక్కించి, తాను మాత్రం పార్టీ అధ్యక్ష పదవితోనే సరిపెట్టుకున్నారు. అధికారం చేపట్టినా, తండ్రి బాటలోనే సాగుతూ వస్తున్న అఖిలేశ్, మొన్న శనివారం అందరికీ షాకిచ్చారు.
ములాయం సింగ్ యాదవ్ సొంతూళ్లో ఆ పార్టీ ఏటా ‘సయిఫాయి మహోత్సవ’ సంబరాలను వేడుకగా జరుపుతున్న సంగతి తెలిసిందే. మొన్న శనివారం కూడా వేడుకలను ములాయం సోదరుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు హాజరయ్యే రాజకీయ, సినీ రంగ ప్రముఖుల కోసం ములాయం ఏకంగా ప్రత్యేక విమానాలనే సిద్ధం చేశారు. అయితే ప్రారంభ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్న అఖిలేశ్ యాదవ్ మాత్రం డుమ్మా కొట్టేశారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య విబేదాలు మొదలయ్యాయన్న వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలకు కారణం కూడా లేకపోలేదు. పార్టీలో అఖిలేశ్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ సునీల్ సింగ్ యాదవ్, ఆనంద్ బదౌరియాలను ములాయం సస్పెండ్ చేశారు. అఖిలేశ్ కు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ములాయం వారిద్దరిపై వేటు వేశారు. పార్టీ అధినేతగా ములాయం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేశ్ అంగీకరించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తండ్రి చర్యపై కాస్తంత గుర్రుగా ఉన్న అఖిలేశ్, సయిఫాయి మహోత్సవానికి డుమ్మా కొట్టారని విశ్లేషకులు అనుకుంటున్నారు.