ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేసినా ప్రత్యేకమే. దాణ స్కాంలో జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన పాపులారిటీ ఇంకా పెరిగిందే తప్ప ఇంచు కూడా తగ్గలేదు. అయితే రాజకీయ ఎంట్రీకి చిక్కులు ఉండటంతో ఫ్యామిలీని బరిలో దింపి విజయకేతనం ఎగరవేయించాడు. ఇప్పుడు రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన పుత్ర రత్నాలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అరంగేట్రంలోనే చిన్నోడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం పదవి చేజిక్కించుకుంటే, పెద్దోడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక మంత్రి హోదాలో తేజ్ ప్రతాప్ యాదవ్ దూసుకెళ్లిపోతున్నాడు. బీహార్ రాజధాని పాట్నాలో నానాటికీ కాలుష్యం స్థాయి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాట్నా రోడ్లపై గుర్రంపై ప్రత్యక్షమయ్యారు. పొలిటికల్ లీడర్ అవతారం తీసేసి జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించిన తేజ్ గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా గుర్రాలెక్కేశారు. వీరి గుర్రపు స్వారీకి సంబంధించిన వీడియో ఫుటేజీలు నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు మాత్రం అయ్య ఆవు మీద సంపాదిస్తే... కొడుకు గుర్రం మీద పడ్డాడంటూ తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు.