అఖిలేశ్ ‘అతి’ జాగ్రత్త బెడిసి కొట్టదు కదా?

October 31, 2015 | 12:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Akhilesh-Yadav-inducts-11-new-faces-in-cabinet-niharonline

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యువ నేతల్లో టాప్ పొజిషన్ లో ఖచ్ఛితంగా ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్. యువ రక్తం అయినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవటంలో మాస్టర్ మైండ్ తో వ్యవహారిస్తుంటాడు. మహా, మహా నేతలకు సాధ్యం కానీ రీతిలో పథకాలను రూపొందించి వాటిలో అమలు చెయ్యటంలో దిట్ట. ఈ విషయంలో తండ్రి,  ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కన్నా అఖిలేష్ ఓ మెట్టు పైనే ఉన్నాడు. అభివృద్ధి విషయంలో ఉత్తరాదిన యూపీ ని అగ్రస్థానంలో ఉంచుతున్నాడు. అయితే అదే సమయంలో ఆయనపై వచ్చే విమర్శలు తక్కువేం కాదు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు, నేతల నుంచే ఆయనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వినిపిస్తుంది.

అభివృద్ధి విషయంలో అఖిలేష్ ను మాట అనలేం కానీ, అదే టైంలో సీనియర్ల సలహాల కంటే సొంత నిర్ణయాలకే ప్రాముఖ్యత ఇచ్చుకుంటాడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దూకుడు నిర్ణయాలతో ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతున్నాడట కూడా. ఇక ఇప్పుడు తాజాగా తన కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేశారు. ఏకంగా 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన అఖిలేశ్, కొత్తగా 11 మందిని కేబినెట్ లోకి తీసుకున్నాడు. శనివారం లక్నోలోని రాజ్ భవన్ లో యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాడు కూడా.

అంతేకాదు పాత మంత్రుల్లోని తొమ్మిది మంది శాఖల్లో మార్పు చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2017 లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ మంత్రి వర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేశాడట. అయితే ముందు జాగ్రత్త పేరిట అఖిలేష్ చేస్తున్న పనిని తండ్రి ములాయంతో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అఖిలేష్ తయారు చేసిన జాబితాలో ముగ్గురు నేర చరిత్ర ఉన్న నేతలు ఉండటం, మరో ఇద్దరు వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కావటం కారణం. అంతేకాదు ప్రజల్లో వారిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉండటం కూడా మరో కారణం. మరి ఇలాంటి సమయంలో అతి జాగ్రత్తతో అఖిలేష్ చేసిన ఈ పని బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ