రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండటం కామనే. అయితే అనుబంధాలను కూడా లెక్క చేయకుండా చిచ్చు రగలటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది తమిళనాట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలో అక్కడ జరగనున్న ఎన్నికలు పాత వైరాలను పక్కనపెట్టేస్తున్నాయి.
నిన్నటికి నిన్న శరత్ కుమార్ స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి జయలలితకు మద్దతు తెలపడం, విజయకాంత్ వైకోతో కలవడం వంటి పరిణామాలు సంభవించగా, మంగళవారం ఏకంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ, తండ్రి కరుణానిధికి దూరంగా ఉంటున్న అళగిరి స్వయంగా ఇంటికి వెళ్లి తండ్రిని కలిశారు. ఇంట్లో ఆధిపత్య పోరు కారణంగా స్టాలిన్ ను వ్యతిరేకించిన అళగిరి, కరుణానిధిని వదిలి పోయిన సంగతి తెలిసిందే.
కాగా, అళగిరి కేవలం తల్లిదండ్రులను పలకరించేందుకు మాత్రమే వచ్చారని స్టాలిన్ వ్యాఖ్యానించినప్పటికీ, తదుపరి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న డీఎంకే అధినేత, తనకు లాభించే ఏ అవకాశాలనూ వదులుకోరాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అళగిరి, కరుణల మధ్య ఎలాంటి రాజకీయ చర్చలూ జరగలేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తును వ్యతిరేకించి కుటుంబానికి దూరమైన అళగిరి, తిరిగి దగ్గరవుతున్నారని తమిళనాట గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు గనక ఏకమైతే రాజకీయాలు మలుపు తిరుగుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.