ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత ఎటకారంగా మాట్లాడుతారో అందరికీ తెలిసింది. సమోసాలో ఆలు ఎంత కాలం ఉంటుందో బీహార్లో లాలూ అలాగే ఉంటాడు ఇలాంటి మాటలతో జనాల్లో బాగా పాపులర్ అవుతాడు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ దేవుడ్నే మోసం చేశాడంటూ ఛలోక్తులతో విరుచుకుపడతాడు. అలాంటాయన కమలనాథుడికిచ్చిన పంచ్ ఇప్పుడు బాగా పేలింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కి ఈ మధ్య బీహార్ పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. పాట్నాలో గత రాత్రి ఆయన బస చేసిన అతిధి గృహంలో లిప్ట్ లో ఆయన ఇరుక్కుపోయారు. దాదాపు నలభై నిమిషాల సేపు ఆయన అందులోనే ఉండవలసి వచ్చింది.రాత్రి పొద్దు పోయేవరకు పార్టీనేతలతో సమావేశం జరిపిన షా ఆ తర్వాత లిఫ్ట్ లో పైకి వెళుతుండగా రెండు ఫ్లోర్ ల మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. పైగా దాని తలుపులు కూడా జామ్ అయ్యాయి. ఆయనతో పాటు నలుగురు నేతలు కూడా ఉన్నారు. లిప్ట్ ఆపరేటర్ కూడా లేడు. పోన్ సిగ్నల్స్ కూడా బయటకు వెళ్లలేదు. ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని గమనించి లిప్ట్ తలుపులు విరగగొట్టి షాను, ఇతర నేతలను బయటకు తీసుకు వచ్చారు. దీనిపై ఆయన అధికారులకు ఓ లేఖ రాశారు. ఇక ఆ లేఖ పై లాలూ అందుకున్నారు.
అమిత్ షా అంత లావున్న మనుషుల్ని బీహార్ లోని లిఫ్ట్ లు మోయ లేవు. ఇక్కడి లిఫ్ట్ లు చాలా చిన్నవంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో లాలూ చేసిన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.