వైకల్యంలో పలురకములు గలవు. ఆర్థిక వైకల్యం అనగా లోటైన, బహులోతైన బడ్జెటు. ఆశ్రయ వైకల్యం తలపై నిలువనీడలేక కుర్చీలు బల్లలు లేక కాల్వగట్టుల మీద, చేలగట్ల మీద సర్దుకుని పరిపాలించుకునే అగత్యం, పాలనావైకల్యం అనగా ఎంతకీ కొలక్కిరాక రైతులు పునాది వేసుకోడానికి జాగా ఇచ్చినా పేచీలు పడుతున్న వైనం, ప్రచార వైకల్యం అనగా పుష్కరాల్లో చోటుచేసుకున్న వైపరీత్యం. ర్యాగింగు వైకల్యం అనగా కొత్తగా వివరించఖ్కర్లేని జాడ్యం, ఏతా వాతా అవశేషాంధ్ర ప్రదేశ్ విభజన తదనాంతరం కకావికలమైపోయి కడుదీన పరిస్థితి ఎదుర్కొంటోంది. దానికి తోడు నాయకుల కొనుగోళ్లలో అసమర్థవ్యాపారపటా టోపం, ఇంటిగుట్టు కాపాడుకోలేని ఫోన్ ట్యాపింగు వ్యవహారం... వెరసి చిందరవందరయి పోయిన అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగుగడ్డ ఎదుర్కొంటున్న కడగండ్లు ఎన్నని చెప్పుకునేది.
వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రత్యేక హోదా తాయిలాతో ఊరిస్తున్న రాష్ట్రనాయకత్వం, భ్రమ పెడుతున్న కేంద్ర నాయకత్వం, భ్రమ పెడుతున్న కేంద్ర నాయకత్వం, మేమూ ఉన్నాం అని భ్రష్ఠాచార్య పర్వానికి ఆద్యులైన సోనియా, ఆమె సుపుత్రుడు అందరూ కలిసి రాష్ట్రంతో ఫుట్ బాల్ ఆడుతున్నారు.
ఆటలో అరటిపండులా సుజనాచౌదరి, మనందరికీ ప్రత్యేక ప్యాకేజీ ఖాయం అని నిన్న హామీ ఇచ్చేరు. ఇచ్చేదీ తెచ్చేదీ ఏమీ లేకపోయినా ఈ రాజకీయ, వ్యాపార దిగ్గజం పిలవని పేరంటంలా ప్యాకేజీ గురించి మాట్లాడి, హోదా విషయం పక్కదారి పట్టిస్తున్నాడు. ఏవన్నా మెంటలా అనగా మానసిక వైకల్యమా?