మీటింగ్ లలో, వేడుకల్లో గంభీరమైన ఉపన్యాసాలు దంచే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గారు మీడియా కనిపిస్తే చాలు చమత్కారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎంత సీరియస్ ఇష్యూ ఐన సరే సరదా సమాధానాలతో దాటవేస్తుంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో సమస్యల గురించి హస్తిన పర్యటనకు వెళ్లిన గవర్నర్ నరసింహన్ మరోమారు ఇలాంటి కామెంట్లే చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. అసలు మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందట. ఆయన అలా వ్యాఖ్యానించటంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారట. వెంటనే ఆయన నవ్వుతూ.... భేటీ వివరాలను మీడియాకు తెలిపారట. కాగా, త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన ఆయన కాలపరిధిని మాత్రం చెప్పలేదు. అనంతరం హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కోసం ఆయన తరలివెళ్లారు. రాజ్ నాథ్ కు ఆయన రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వివరించి నివేదిక సమర్పిస్తారట. ఈరోజు, రేపు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో ఆయన పలువురు మంత్రులను కలవనున్నట్లు సమాచారం.