కాలం మారింది. మహిళాలోకం లేచింది. వనితలు వంటింటి కుందేళ్లంటే, అన్నాళ్లు దంతవైద్యులను దర్శించుకునే పరిస్థితి. వర్తమానకాల పరిస్థితులనాకళింపు చేసుకున్న నారాభువనేశ్వరి పెనిమిటి పురాణాల సంది వంటలు చేసిన మగ పురుషులనందరిని తలంచుకుని సాటి పెనిమిటిలందరికీ ఒక సందేశం ఇవ్వడం జరిగింది. తక్షణమే వంట నేర్చుకోండి అన్నలారా, తమ్ములారా అనేది దాని చరాంశం.
సదరు భువనమ్మ పెనిమిటి తన చైనా పర్యటనలో ఒక చైనామేయరుగారితో భేటీ అయినప్పుడు ఆయన పాక శాస్ర్త ప్రావీణ్యం విని, తప్పక వచ్చి భోంచేస్తానని మాట ఇచ్చినట్లుగా ప్రకటించేరు. అందర్నీ వంటనేర్చుకోమని ఉద్రేకపరుస్తుంటే ఆయన కూడ నేర్చుకునే ప్రమాదం ఉందేమో అనుకొన్నాం. చైనాలో కూడా తాను వచ్చి బువ్వతిని పెడతాను అన్నాడు గాని నేర్చుకుని వెళ్లి భరతమాతకు వడ్డిస్తాననే మాట మాత్రం అనలేదు. అమాయకులు వండి, వార్చి, వడ్డిస్తే గడుసుపిండాలు గొంతునిండా మెక్కి, మెచ్చి మేకతోలుకప్పుతుంటారు. ఆ పొగడ్తల వలలో పడి కొట్టుకుంటూ వంటలు చేస్తూనే తనువులు చాలిస్తుంటారు. అన్నపూర్ణయ్యా సుఖీ భవ.. అంతే సంగతి