తిన్నది బీఫ్ ఏమోనన్న నెపం మీద ప్రాణాలు పోగొట్టుకున్న ఇఖ్లాక్ కుటుంబం కన్నీటితో కకావికలయి రోదిస్తుంటే రాజకీయానికి పసందయిన మసాలా దొరికిందని దౌర్భాగ్య దామోదరులు చంకలు గుద్దుకుంటున్నారు. కులవైషమ్యంతో ఎక్కడో వెనకబడిపోతామో అని దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకునే తంత్రం నడుస్తోంది. కొంతమందికి గోవు దైవం, తల్లి వగైరా అవతారాలెత్తింది.
ఇక కృష్ణుడికి కూడ క్యాస్ట్ ఫీలింగ్ అంటించేసి, గోమాత మావంశీకుల నుంచి స్వంతం అని ప్రకటించిన లాలూ, ఆవుపేడ తమకు మంచి గంధంతో సమానమని ప్రకటించేడు. శ్రీకృష్ణమూర్తి కూడ ఆవు ప్రక్కనే నిలబడి ఫోటో తీయుంచుకున్నాడుగానీ, పైకి ఎక్కి స్వారీ చేసి వాహనంగా వాడిన దాఖలాలు లేదు. కనుక యాదవ్ లాలూకి గత హక్కు ప్రశ్నించలేనిది. ద్వాపరయుగం నుంచీ గోవులు, గోపాలురూ ఉన్నారుగానీ, తురుష్కులు మధ్యలో ఎప్పుడొచ్చినారు. వారి ఆహారపు అలవాట్లు ఏమి? ఆంగ్లేయులు, తురుష్కులు బీఫ్ నంజుకోవడంలో ఏకాభిప్రాయులై వర్థిల్లుతుండగా, వరాహం విషయంలో స్వల్ఫంగా విబేధించారు. ఏదీఏమైనా కలియుగంలో బీఫ్ పేరుతో ఇఖ్లాక్ బలయిపోవటం అన్యాయమేమరి!