తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ విజయవాడకు చెందిన ఓ కుటుంబం ప్రచారం పేరిట తెగ హడావుడి చేస్తోంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో తెలుగువారికి ఏం పనేగా మీ అనుమానం. చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయవాడకు చెందిన వడ్డమన్నాటి విజయకృష్ణ పోటీ చేస్తున్నారు. అందుకే ఆయన గెలుపు గెలుపు కోసం ఆయన తల్లిదండ్రులు, సోదరి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.
విజయవాడలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయకృష్ణ ప్రస్తుతం చెన్నైలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు చందు చెన్నైలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్. సమాజానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే శివసేన అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగారంట. ఆయన తల్లి హరిప్రియాదేవి సోమవారం బెజవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని తమ వారికి తెలుగు నేలకు చెందిన వారు ఈ విషయాన్ని తెలియజేయాలంటూ హైటెక్ ప్రచారంకు దిగారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ ప్రముఖ హీరోయిన్ గాయత్రి రఘురామన్ ని బరిలో నిలిపింది. ఇక చెన్నై కి చెందిన మరో తెలుగు వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి జయలలితనే ఢీకొట్టబోతున్నాడు. కే.జగదీశ్వర్ రెడ్డి అనే నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రతీ ఎన్నికల మాదిరిగానే ఈ దఫా కూడా పెద్ద సంఖ్యలోనే తెలుగువాళ్లు అక్కడ పోటీకి దిగుతున్నారు. తమిళనాడులో స్థిర పడ్డ తెలుగువారి సంక్షేమం కోసం అసోషియేన్ గా ఏర్పడటమేకాదు, ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వేల మంది తెలుగు వారు పోటీ చేయబోతున్నారు.