మహారాష్ట్ర ఎన్నికలు, తమిళనాడు ఎలక్షన్స్, బెంగళూర్ కార్పొరేషన్ ఎన్నికలు, యూపీ ఎన్నికలంటూ ప్రకటన... ఇప్పడేమో బీహార్ ఎన్నికలు. గెలిచినా... గెల్వక పోయినా ఇలా వరుస బెట్టి ఎన్నికలకు సమాయత్తమవుతోంది మజ్లిస్ .
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన ఈపార్టీ దేశవ్యాప్తంగా హవా చూపేందుకు రెడీ అయిపోవటం ఆశ్చర్యం కలిగించేదే. మజ్లిస్ కు ఉన్నవి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. అదికుడా భాగ్యనగరంలోనే. నల్గొండ, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పేరు వినిపించినప్పటికీ అక్కడ సరైన నాయకుడు, ప్రజల్లో సానుకూలత కొరవైందనే చెప్పాలి. కానీ, అవేం పట్టనట్టు పార్టీ విస్తరణపై అధ్యక్షుడు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా బీహార్ ఎలక్షన్లపై ఆయన చేసిన మరో ప్రకటనే ఇందుకు నిదర్శనం. సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 24 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. సీమాంచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రాన్నికోరారు. ఆర్టికల్ 371ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల ప్రీపోల్ సర్వేలు బిన్నంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంచల్ ప్రాంతంలో 70శాతం మంది దళితులు, ముస్లింలు ఉన్నారని తెలిపారు. దళితులు, ముస్లింల అభివృద్ధే తమ ధ్యేయమని అసద్ స్పష్టం చేశారు.
అసలు ఏం చూసుకుని ఒవైసీ ఇలా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ (బీహార్ లో) మూడు గ్రూపులున్నాయి. ఓవైపు జనతాపరివార్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు వామపక్షాలు. ఇలా వేటికవే స్ట్రాటజీలు మెయింటెన్ చేస్తున్నాయి. మహా ఎన్నికల్లో అది గెలిచింది రెండు మూడు సీట్లే అది కూడా అతికష్టం మీద. ఇక తమిళనాడులో పార్టీకి పాపులారిటీ ఏమంత లేదు. బెంగళూర్ ఎన్నికల్లో ఫలితం ఎలా రివర్స్ అయ్యిందో తెలిసిందే. మరి ఇలాంటి టైంలో మజ్లిస్ కు బీహార్ లో లాభం చేకూరుస్తుందని అనుకోవటం అత్యాశే అవుతుంది.