బీజేపీ ‘గాడిద’ పోస్టర్ రచ్చ రేపుతోంది

May 09, 2016 | 11:22 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Yogi Adityanath-tiger-rahul-donkey-niharonline

నేతలను హైలెట్ చేయడానికి కార్యకర్తలు చేసే అతి ఒక్కోసారి వికటించడం పరిపాటే. కార్యకర్తలనే కాదు, సదరు నేతగారు కూడా ఆ వివాదంలో ఇరుక్కోవటం మనం తరచూ చూస్తుంటాం. సరిగ్గా ఉత్తరప్రదేశ్ బీజేపీ కార్యకర్తలు అలాంటి పనే ఒకటి చేసి ఇరకాటంలో పడ్డారు. గోరఖ్ పూర్ లో వెలసిన గాడిద పోస్టర్ ఒకటి ఇప్పుడు  పెను కలకలం రేపుతోంది. బీజేపీ మైనారిటీ సెల్ తరపున వేసిన పోస్టర్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా యూపీ మాజీ సీఎం మాయావతి, ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ లను గాడిదలుగా చిత్రీకరించి పేర్కొన్నారు. ఇక మన హైదరాబాదు ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా వారు వదిలిపెట్టలేదు. అయితే ఇదంతా ఎందుకయ్యా అంటే తమ నేతను మెప్పించడం కోసం.

                                 నేతలందరినీ గాడిదలుగా వర్ణించిన ఆ పోస్టర్ లో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ను మాత్రం పులిగా అభివర్ణించారు. ఓ వైపు యోగిని పులిగా అభివర్ణిస్తూనే... పులి బొమ్మ వెనుక ఆయన ఫొటోను ముద్రించారు. మరోవైపు రాహుల్, మాయావతి, అఖిలేశ్, ఒవైసీలను గాడిదలుగ చూపిస్తూ వారి ఫొటోలకు గాడిదల బొమ్మలను అతికించారు. గతంలో రాహుల్ గాంధీని సింహంగా, రక్షకుడిగా(పోలీస్ గెటప్ లో) కాంగ్రెస్ పార్టీ వేసిన పోస్టర్ కు కౌంటర్ గానే ఈ పోస్టర్ ను వేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత పోస్టర్ పై కాంగ్రెస్ మండిపడుతోంది. తక్షణమే యోగి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ