మొక్కవోని దీక్షతో, వీరోచిత పోరాటంతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ కలను సాకారం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇక బంగారు తెలంగాణే ధ్యేయంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని తనకున్న విజన్ తో దూసుకెళ్తున్నారు. మధ్యలో రాజకీయ దుమారం రేపేందుకు ప్రత్యర్థులు చేయని పనులంటూ లేవు. అందులో భాగమే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరూ అనేది. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో కీలకనేతగా ఉండటంతోపాటు అన్ని బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపే వ్యక్తి ఎవరంటే. ఒక్క హరీష్ రావే. ఆయన వేలు పెట్టిన ప్రతిదాంట్లోనూ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. అలాంటి వ్యక్తికి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి పొసగట్లేదని వార్తలతో విభేధాలు సృష్టించాలని చాలా ప్రయత్నించారు. కానీ, వారు లైట్ తీస్కోవటంతో ఆ అంశం ఎప్పటికప్పుడు కనుమరుగు అవుతుంది.
ఇక తాజాగా టీఆర్ఎస్ లో ఒకప్పుడు ప్రతినిధిగా వ్యవహరించి అనంతరం అన్ని పార్టీలు మారి చివరికి కాషాయం కండువా కప్పుకున్నాడు రఘునందన్ రావు. టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ను గానీ, పార్టీని గానీ ఎవరైనా పన్నెత్తి మాట అంటే చీల్చి చెండాడే వాడు ఈయనగారు. కానీ, ఎన్నికల్లో సీటు రాలేదన్న ఆవేదనతో పార్టీ నుంచి బయటికి వచ్చి మొదలుపెట్టిన విమర్శలు ఇప్పటికీ కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలో తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఈ బీజేపీ అధికార ప్రతినిధి చెబుతున్నాడు. అసలు ఆపరేషన్ ఆకర్ష్ కి కారణం కూడా ఇదేనట. యువరాజుకు(కేటీఆర్) పట్టాభిషేకం చేసే క్రమంలోనే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. అంతర్గతంగా ఉన్న పోటీని తట్టుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన కుమారుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారని అంటున్నాడు. రాజకీయాల్లో వారసత్వం కొరుకోవటం తప్పేమీ కాదు. పైగా, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొనటంతోపాటు రాజకీయాల్లో ఇప్పుడు ఆదర్శవంతమైన నేతగా అవార్డు అందుకున్న కేటీఆర్ సీఎం అయితే పురోగతి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయినా టీఆర్ఎస్ లో అభ్యంతరాలే లేనప్పుడు రఘునందన్ కు వచ్చే నష్టమేంటో తెలియడం లేదు.