ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం. ఎట్టకేలకు టీడీపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష వైసీపీకి పెద్ద షాకే తగలనుందని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఈ మేరకు పార్టీ మారనున్నట్లు తోటి నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో భూమానే స్వయంగా ఈ విషయం చెప్పినట్లు భోగట్టా. తద్వారా తన కుమార్తెకు మంత్రి పదవి వస్తుందని భూమా ఆలోచనగా తెలుస్తోంది.
పార్టీలో చేరినప్పటి నుంచి జగన్ కు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు అండగా ఉన్నారు. శోభ మరణంతో ఆ ఎన్నికల్లో గెలుపొందారు కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి. గత కొద్దిరోజులుగా వీరిద్దరు క్రియాశీలకంగా లేరు. దీంతో అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు కర్నూలు జిల్లాకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట వ్యాఖ్యలు చేయగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ, తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సంప్రదింపులు కూడా జరుపుతున్నాయని అన్నారు. ఇలా ప్రకటన చేసిన రెండో రోజే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనుండటం గమనార్హం. ఈ విషయాన్ని భూమా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తన కూతురికి మంత్రి పదవి ఆఫర్ చేసి తనను టీడీపీలోకి రావాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చినట్లు భూమా గతంలో విమర్శించటం.