బీహార్ ఫలితాలు వెలువడ్డాయి. కమలం వాడింది. మహాకూటమి ఘన విజయం సాధించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసొచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే గొడుగుకిందకు రావడం, బీజేపీ విధానాలు, స్థానికత మొదలైన అంశాలు ‘మహా’ విజయాన్ని దక్కించాయి. ఇక, కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు, బీజేపీ మిత్ర పక్షాల కూటమి దారుణ పరాజయానికి కారణాలు ఉన్నాయి. అయితే ముందుగా ఇక్కడ మహా కూటమి తెలివిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చకుండా కాంగ్రెస్ ను తమ కూటమిలో చేర్చూకోవటం జేడీ(యూ), ఆర్జేడీ లు చేసిన ప్రధాన పని. దీంతో ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండాలన్న నితీశ్ లాలూ వ్యూహాం ఫలించింది.
ఇక బీజేపీ విషయానికొస్తే స్వయానా ప్రధాని నరేంద్ర మోదీయే రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించినా, పార్టీ అధినేత అమిత్ షా వ్యక్తిగత చాలెంజ్ గా తీసుకుని పని చేసినప్పటికీ ఫలితం శూన్యంగా నిలిచింది. బీజేపీ పై మెల్లిగా ప్రభలుతున్న వ్యతిరేకతను బీహార్ మొత్తం వ్యాప్తి చేయటంలో కూటమి విజయవంతం అయ్యింది. మరోవైపు నితీశ్ పదేళ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి రేటు పెరగటం కూటమికి కలిసొచ్చిన అంశాలు. సున్నితమైన రిజర్వేషన్ల అంశంపై కొందరు నేతల వ్యాఖ్యలను మహా కూటమి నేతలు ప్రచారాస్త్రంగా చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ అంశం వివాదాస్పదమవ్వడం, దీనిపై సొంత పార్టీ ఎంపీలు శత్రుఘ్న సిన్హా, ఆర్కే సింగ్ అసమ్మతి వెళ్లగక్కడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల అంశం, బీజేపీ తమ పార్టీ తరఫు నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వంటి అంశాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఓటమి పాలవ్వడానికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఎన్నికల్లో ఇదే తరహా ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పలేమంటున్నారు.