అమెరికా అధ్యక్ష పదవిలో భారత సంతతి వ్యక్తిని చూడాలన్న కొరిక కలగానే మిగిలింది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా, పెద్దన్న పాత్రలో ప్రపంచ దేశాలను శాసిస్తూ మనోడిని చూసుకోవాలన్న ఆశా అడియాసే అయ్యింది. అధ్యక్ష పదవీ రేసులో పోటీ పడుతున్న లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడబోవడం లేదని ఆయన ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని, రిపబ్లికన్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి తన పూర్తి మద్దతు ఇస్తానని ఈ ప్రవాస భారతీయ సంతతి నేత వివరించారు.
తాను పోటీ పడేందుకు ఇది సరైన సమయం కాదని భావించిన మీదటే వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపారు. కాగా, ఓటర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడం, నిధుల సమీకరణలో అసంతృప్తి, డొనాల్డ్ ట్రంప్ వంటి బలమైన ప్రత్యర్థులు ఇత్యాది కారణాలతో బాబీ జిందాల్ తప్పుకున్నట్టు సమాచారం. బాబీ తప్పుకోవడంతో రిపబ్లికన్ల తరపున ఇంకా 14 మంది ప్రెసిడెంట్ రేసులో మిగిలివున్నారు.