ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయంలో భాగంగా డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రజా వ్యతిరేక నిర్ణయమంటూ బహిరంగ విమర్శలు వినిపించినప్పటికీ కేజ్రీ సర్కార్ మాత్రం ఆ నిర్ణయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. అయితే ప్రజలు మాత్రం దీనికి కొత్త దారి వెతికారు. తమ ఆలోచనలతో సర్కార్ కి ప్రజలు మాత్రం గట్టి ఝలకే ఇస్తున్నారు. ఏదిఏమైనా చౌకగా లభించే డీజెల్ వైపే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఎలాగంటారా? సెకండ్ హ్యాండ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ)లకు అమాంతం డిమాండ్ పెరగడమే ఇందుకు నిదర్శనం. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు సెకండ్ హ్యాండ్ మార్కెట్లోని పెద్ద కార్లపై మక్కువ చూపుతున్నారు. ఓ చిన్న పెట్రోల్ కారును కొనుగోలు చేసే బదులు ఎస్యూవీని అదే ధరకు సొంతం చేసుకోవచ్చన్నది వీరి భావన.
ఇదే సమయంలో 2000 సీసీ కన్నా లోపు ఇంజన్ సామర్థ్యమున్న వాహనాలపైనే నిషేధం ఉండటం, ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలు అంతకన్నా ఎక్కువ ఇంజన్ కెపాసిటీతో ఉండటంతో వాటిపై ప్రజలకు ఆశలను పెంచింది. పైగా, 8 మంది వరకు సులువుగా ప్రయాణించే సౌలభ్యం కూడా ఉండటంతో అత్యధికులు ఇన్నోవా, ఫార్చ్యూనర్, స్కార్పియో, ఎక్స్యూవీ 500, ఎండీవర్ వంటి వాహనాలను కొనేందుకు యత్నిస్తున్నారు. పైగా వాటిని డీజెల్ తో నడుపుకోవచ్చు కూడా. ఈ ఆలోచనే ఇప్పుడు ఎగువ మధ్య తరగతికి పెద్ద కార్లను దగ్గర చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా, ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందన్న ఆశ మాత్రం నెరవేరేలా కనిపించటం లేదు.