తెలంగాణలో అధికారపక్షం టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ కి మధ్య వైరం ఏపాటిదో మనందరికీ తెలుసు. ఒకానోక టైంలో మిత్రపక్షాలుగా మెలిగిన వీరు ఇప్పుడు బద్ద శతృవులుగా మారిపోయారు. సీనియర్ నేతలు కూడా అంతకుముందు ఉన్న తమ మైత్రిని మరిచి తరచూ నోరు పారేసుకోవటం మనం చూస్తున్నాం కూడా. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎల్సీ నేత, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అయిన పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) వర్థంతి జరిగింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ లో ఉన్న పీజేఆర్ విగ్రహానికి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతికినంత కాలం పేదల అభ్యున్నతి కోసం తపించిన నేత పీజేఆర్ అని కొనియాడారు. ఆయన ఆశలను, ఆశయాలను టీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు. ఇక్కడ వింత ఏమిటంటే... గత కొన్నేళ్లుగా పీజేఆర్ వర్థంతి వేడుకలను కాంగ్రెస్ నిర్వహించకపోవటం. ప్రజల మనిషిగా పార్టీకి వన్నె తెచ్చిన ఓ వ్యక్తికి జయంతి, వర్థంతి వేడుకలను కాంగ్రెస్ లైట్ తీస్కుంటున్న టైంలో, ప్రజలే స్వయంగా స్వంత ఖర్చులతో జరుపుతూ వస్తున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ప్రజల నుంచి క్రెడిట్ కొట్టేయటంతోపాటు, ప్రతిపక్షానికి దెబ్బకొట్టే విధంగా ఈసారి వర్థంతి వేడుకలను నిర్వహిస్తుండగా దీనికి కవిత నేతృత్వం వహించటం విశేషం.