ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు క్లారిటీ లేని కేంద్రం ప్రకటన వెరసి నవ్యాంధ్ర నూతన రాజధాని విషయంలో కాసిన్ని అనుమానాలు నెలకొన్నమాట వాస్తవమే. అయితే అమరావతి శంకుస్థాపన సమయంలో ఆ అనుమానాలు పటా పంచలయిపోయాయి. భారీ సంఖ్యలో విదేశీ ప్రతినిధుల హాజరుతోపాటు వారి ప్రకటనలు ఊరటనిచ్చేలా ఉండటం ఇందుకు కారణం. అంతేకాదు శంకుస్థాపన అనంతరం కూడా పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు ముందుకు రావటం విశేషం. ముఖ్యంగా దేశీ కంపెనీల కన్నా విదేశీ కంపెనీలు ఈ విషయంలో ముందుండటం వెరసి ఆర్థికంగా బలపడటానికి అమరావతికి ఇంత కన్నా ఏం కావాలి.
ఇప్పటిదాకా సింగపూర్, జపాన్ లే అమరావతికి అండగా ఉంటున్నాయనుకున్న సమయంలో ఇప్పుడు మరో అగ్రదేశం కూడా అమరావతికి తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. బ్రిటన్ కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామి కానుంది. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో దేశ ప్రధాని మోదీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆ దేశ ప్రధాని జేమ్స్ కామెరూన్ చేసిన సంయుక్త ప్రకటనలో అమరావతి ప్రస్తావన రావటంతో వార్తల్లో హైలెట్ గా నిలిచింది. అమరావతితో పాటు మహారాష్ట్రలోని పుణే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాల అభివృద్ధికి భారత్, బ్రిటన్ లు సంయుక్తంగా కృషి చేయనున్నట్లు ఇరువురు ప్రధానులు ప్రకటించారు. మోదీ నుంచి సానుకూలత లేదనుకుంటున్న చంద్రబాబుకి ఈ ప్రకటన కొండంత ధైర్యం కలిగించేదే.