పంచెకట్టులో నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశాడు. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో వారిద్దరు ఏం చర్చించుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్షాలు వీరి కలయికపై సరికొత్త భాష్యాలు చెప్పాయి. రైతుల తరపున పోరాటం చేయడానికి వెళ్తున్నారా? లేక చంద్రబాబుతో రాజీపడేందుకు వెళ్తున్నారా? అంటూ సెటైర్లు వేసింది. అయితే సర్దార్ షూటింగ్ లో బిజీగా ఉన్న తాను అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, అందుకు సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇప్పుడు, ఇక్కడికి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఆయన రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్టు పవన్ చెప్పారు. ఈ సమావేశంలో రాజధానిలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం దృష్టి మొత్తం రాజధానిపైనే కాకుండా మిగతా ప్రాంతాల వైపూ చూడాలని ప్రస్తావించానన్నారు. ఇందుకు స్పందించిన సీఎం... ఎవరినీ బలవంతపెట్టి భూమిని తీసుకోబోమని చెప్పారన్నారు. అందరితో చర్చించాలకే భూములు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు.
ప్రధానంగా విశాఖ బాక్సైట్ తవ్వకాలపై ప్రధానంగా చర్చించామని పవన్ వెల్లడించారు. గనులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా పునరాలోచించుకోవాలని చంద్రబాబుకు సూచించినట్టు పేర్కొన్నారు. గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరానని, చర్చించిన తరువాతే బాక్సైట్ పై ముందుకెళతామని చంద్రబాబు చెప్పినట్టు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రస్తావన కూడా వచ్చిందని, ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్నారని పవన్ తెలిపారు.