వ్యాపం... అణుబాంబు విస్ఫోటనంతో సమానం. ఈ మహాపాపం... ముఖ్యమంత్రి, గవర్నర్, సీనియర్ రాజకీయ నాయకులు, అధికారులు, దళారీలు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు... తలా పాపం తలా పిడికెడు... మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఒడిసిపట్టి భయభ్రాంతుల్ని చేస్తున్న యమపాశం! కనీవినీ రీతిలో జరుగుతున్న మారణహోమం! అనర్హులను అందల మెక్కించి బాధ్యతాయుత పదవుల్లో కూర్చోబెట్టడం, వైద్య విద్యా అర్హతపై ఎంపిక చేసే పరీక్షల్లో పెడదారిలో ఎంపిక చేయడం లాంటి ఘోర నేరానికి పాల్పడిన దారుణ కార్యక్రమం ఇది. పదిహేను సంవత్సరాల క్రితమే ఈ దుశ్చర్యలకు నాంది జరిగింది. ఈ దారుణాలన్నీ వ్యాపం పేరుతో వ్యవహారించబడుతున్న వ్యవసాయక్ పరీక్షా మండల్ లేదా మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎక్సామినేషన్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఘోర కలి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ జోక్యంతో 200 మంది ఊచలు లెక్కిస్తున్నారు. రీసెంటుగా సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ అవకతవకలకు మూల పురుషుడు, రింగు మాస్టరు జగదీష్ సాగర్ అనే పుణ్య పురుషుడు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా జైలు కెళ్లడం జరిగింది. ఒరిజినల్ అభ్యర్థి అభ్యర్థి ఫోటో మార్చి తెలివైన టాపర్స్ ఫోటో పెట్టి వాడితో పరీక్ష వ్రాయించడం ఇందులో బోర్డు సభ్యులు కుమ్మక్కయి భారీ మొత్తం చేతులు మారడం జరిగేది. బడుద్ధాయిని ఇద్దరు చదువరుల మధ్య కూర్చోబెట్టి కాపీ కొట్టించడం, ఖాళీ జవాబు పత్రాల్ని యధాతధంగా ఉంచి, తీరిగ్గా ఎక్కువ పర్సంటేజ్ మార్కులు వచ్చేలా చేయటం లాంటిది గజకర్ణగోకర్ణ విద్యలకు ఈ బోర్డు ఆలవాలం! ఈ వ్యవహారంలో ఎస్ టీ ఎఫ్ ఎంక్వయిరీ చేసి 1020 ఫారాల్ని, 346 గురు తెలివైన కిరాయి రాతగాళ్లను లోపలికి పంపించింది. టోటల్ గా 92,176 నేరాల్ని గుర్తించింది. రవికాంత్ ద్వివేది అనే రెవెన్యూ జాయింట్ కమిషనర్ ఇంటిపై దాడి చేసిన సందర్భంలో దొరికిన ఆస్తి విలువ ఎంతో తెల్సా?... 600 నుంచి 700 మిలియన్ రూపాయలు. గవర్నర్ రాంనరేష్ యాద్ పాత్రపై కూడా సాక్ష్యం దొరకగా, తాను రాజ్యాంగాధినేతనని మొరాయించగా, 2016 సెప్టెంబర్ లో రిటైర్ అయిన తర్వాత శ్రీవారి సంగతి చూస్తామని యస్.టి.ఎఫ్ ఛీఫ్ మాట ఇచ్చేరు. ఇప్పటి వరకు దాదాపు 49 మంది ఈ వ్యవహారంలో అసహాజంగా (అనుమానాస్పద స్థితిలో) మృత్యువాత పడ్డారు. ఆఖరి గవర్నరు కొడుకు శైలేశ్ కూడా రాజ్ భవన్ లోనే చనిపోవటం జరిగింది. అనుమానస్పద రీతిలో యువకులు గుండెపోటుతో మరణించడం, విష ప్రయోగం జరగడంలాంటివి స్పెషల్ టాస్క్ ఫోర్సు దృష్టికి వచ్చేయి. ఈ మృత్యుహేలకి అంతమెప్పుడు?