కర్నూలు జిల్లా రాజకీయాలను ఓ కొలిక్కి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ మాములు విషయం కాదు. నిన్న గాక మొన్న విజయనగర-బొబ్బిలి రాజుల మధ్య వందల ఏళ్ల వైరాన్ని ఒక్క సిట్టింగ్ లో పరిష్కరించిన బాబు ఇప్పుడు కర్నూల్ ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టారు. రీసెంట్ గా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, ఎప్పటి నుంచో ఉన్న శిల్పా మోహన్ రెడ్డిల మధ్య రాజీ కుదిర్చేందుకు భారీగానే కసరత్తు జరిగిందని వార్తలు వినవచ్చాయి. విజయవాడ కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చర్చలు ముగిసి మీడియా ముందుకు వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డిలు భూమాతో సయోధ్య కుదిరిందని ప్రకటించారు.
భూమా, శిల్పాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు శ్రమించాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఆదేశాలతో ఇరు వర్గాలతో చర్చలకు పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. అయితే చర్చలు సింపుల్ గానే అయినట్లు తెలుస్తోంది. గంటల తరబడి జరిపిన చర్చల్లో ఇరువర్గాలు ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకునేందుకు చాలా తక్కువ టైమే పట్టిందట. ఆ తర్వాత చర్చల పురోగతిని చంద్రబాబుకు వివరించారు. ఇక నేడు కూడా అందుబాటులోనే ఉండాలన్న అధినేత ఆదేశాల్లో ఇరువర్గాలు రాత్రి విజయవాడలోనే బస చేశాయి. తాజాగా నేటి ఉదయం జరిగిన చర్చలకు చంద్రబాబు, కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని పిలిపించారు. సింగిల్ సిట్టింగ్ లో చంద్రబాబు ఈ సమస్యను పరిష్కారం చేయగలిగారు. మరోవైపు సీనియర్ నేతలు కూడా కీలక విషయాలను ఎప్పటికప్పుడు పార్టీకి అందించి చర్చలు విజయవంతమయ్యే విషయంలో కీలకంగా వ్యవహరించారుట. నేతలంతా భేటీపై టెన్షన్ పడుతుంటే చంద్రబాబు మాత్రం చాలా కూల్ గా పనిచేసుకుంటూ పోయారంట.