మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి కొత్త బాస్ రానున్నారా? అదేంటీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ అనుంగు అనుచరుడు అమిత్ షా ఉన్నారు కదా అంటారా? ఉండనైతే, ఉన్నారు గానీ అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం ఈ నెల 23తో ముగియనుంది. అదీగాక ఆయన పార్టీ కార్యవర్గం ఎన్నుకున్న అధ్యక్షుడు కూడా కాదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవి చేపట్టిన రాజ్ నాథ్ సింగ్, పార్టీ అధికారంలోకి రాగానే మోదీ కేబినెట్ లో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అమిత్ షా ఆయన పదవిలోకి వచ్చేశారు. రాజ్ నాథ్ పదవీ కాలం ముగిసేంతవరకే అమిత్ షా ఆ పదవిలో కొనసాగుతారని నాడు పార్టీ ప్రకటించింది.
ఆ గడువు ఈ నెల 23తో ముగియనుంది. దీంతో పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 10 తర్వాత ఏ క్షణాన్నైనా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీ నిర్దేశిత మూడేళ్ల పదవి కాలం దక్కని అమిత్ షానే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవల బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం షాకు ఎంత మేర కీడు చేస్తుందో చూడాలి.