‘సరైనోడు’ దొరకటం లేదా?

December 30, 2015 | 04:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi-revamp-cabinet-can-not-find-the-people-niharonline

వరుసగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ప్రధాని మోదీ తన క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారని మీడియాలో భారీ ప్రచారమే జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి ఇబ్బందులు తెచ్చిన వారితోపాటు పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించాలని మోదీ భావిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడో  సమస్య మోదీకి అడ్డంకిగా మారుతుందట. సరైన వ్యక్తులు లేకనే మంత్రి వర్గాన్ని మార్చటంలో మోదీ తటపటాయిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో కొందరు మంత్రుల తొలగింపు ఉండవచ్చని, అయితే భారీ స్థాయిలో మార్చేందుకు తగినంత నాణ్యమైన నేతలు లేరని మోదీకి దగ్గరగా మెలిగే బీజేపీ నేత ఒకరు వివరించారు.

                               దీంతో పార్టీ భవిష్యత్తుపై మోదీ ఒత్తిడిలో పడ్డట్లయిందని, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయినా, ఉద్యోగాల కల్పన, వృద్ధి తదితర అంశాల్లో ముందడుగు పడలేదని, సంస్కరణల అమలు సైతం ఆగిందని మోదీ అభిప్రాయపడుతున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ నేత తెలిపారు. సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ఆయన ముందు పెను సవాలుగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావించినా, ఆర్థిక శాఖను నెరిపేంత సమర్థత మరెవరి వద్దా లేక ఆయన మనోహర్ పారికర్ ను ఎంచుకున్నారని పార్టీ వర్గాలు గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికారికంగా మాట్లాడేందుకు మాత్రం ఏ నేతా అంగీకరించడం లేదు. ఈ విషయంలో సీనియర్లు ఏమైనా జోక్యం చేసుకుంటారేమో చూడాలి మరి. అయితే ఇంత మాట్లాడిన ఆ సీనియర్ నేత కాసేపటికే నేనలా వ్యాఖ్యానించలేదని చెప్పటం కొసమెరుపు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ