కార్గిల్ యుద్ధం... దాయాది దేశాల మధ్య జరిగిన కీలక భీకరపోరు. మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దులలో ఈ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్ఒసి(వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడటం యుద్ధానికి ఆజ్యంపోసింది. తొలుత ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధమని, తమ సైనికులకు ఏమాత్రం సంబంధంలేదని పాక్ బుకాయించింది. అయితే యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు, ఆపై పాక్ ప్రధాని, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇది వారి పనేనని రుజువయ్యింది. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధంలో పాక్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం తిరిగి స్వాధీనపరుచుకుని విజయం సాధించింది. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోదిగా చెప్పవచ్చు. అయితే ఈ యుద్ధం గనక మరొకొన్ని రోజులు సాగి ఉంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేదట.
హిరోషిమా, నాగసాకిల రేంజ్ లో యుద్ధ భూమిలో అణు బాంబులు పడి ఉండేవట. అసలు విషయమేమిటంటే, పాక్ తన తప్పు తెలుసుకుని వెనకడుగు వేస్తే సరి, లేదంటే తాము వేసే తదుపరి అడుగు భయంకరంగా ఉంటుందని అప్పటి భారత ప్రధాని వాజ్ పేయి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు తేల్చిచెప్పారట. ఈ మేరకు వాజ్ పేయి రాసిన లేఖను నాటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా జెనీవాలో అమెరికా అధ్యక్షుడి ప్రతినిధికి అందజేశారు. ‘‘ఏదో విధంగా వారిని తరిమికొట్టేస్తాం’’ అని ఆ లేఖలో వాజ్ పేయి పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై తాను చనిపోవడానికి రెండు నెలల ముందు బ్రజేష్ మిశ్రా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాజ్ పేయి లేఖను అందుకున్న అమెరికా ప్రతినిధి లేఖ అర్థమేంటని మిశ్రాను ప్రశ్నించారు. దీనికి మిశ్రా కాస్త లౌక్యంగానే సమాధానమిచ్చారు. అసలు విషయాన్ని అమెరికా ప్రతినిధికి చెప్పలేదట. అయితే ఇంటర్వ్యూలో మాత్రం ఆ లేఖ అర్థాన్ని బ్రజేశ్ వెల్లడించారు. ‘‘నియంత్రణ రేఖను దాటేందుకు వెనుకాడేది లేదు. అణు బాంబుల ప్రయోగం కూడా లేదని చెప్పలేను’’ అన్న కోణంలోనే వాజ్ పేయి ఆ లేఖ రాశారట. ఇక ఇప్పుడు ఈ వివరాలను ప్రముఖ పాత్రికేయుడు బర్కా దత్ రాసిన ‘‘దిస్ అన్ క్వైట్ ల్యాండ్- స్టోరీస్ ఫ్రం ఇండియాస్ ఫాల్ట్ లైన్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. నాటి యుద్ధంలో భారత సైన్యం అనుసరించిన వ్యూహాలతో పాటు రచించి అమలు చేయని వ్యూహాలను కూడా బర్కాదత్ ఇందులో క్షుణ్ణంగా పేర్కొనటం విశేషం. ఒకవేళ భారత్ గనుక అణుబాంబులు వేసి ఉంటే పాక్ పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో ఎవ్వరూ ఊహించలేరు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆ దేశం అసలు కోలుకోవటం మాత్రం అంత సులువుగా అయ్యే పని మాత్రం కాదు.