పిగ్ హంట్... ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో కొనసాగుతున్న ఆపరేషన్. నగరంలో స్వైర విహారం చేస్తున్న పందుల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక పందుల కారణంగా నగరంలో పలు వ్యాధులు సంక్రమిస్తున్నాయని నగర జనం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పందుల నిర్మూలనకు ఏలూరు కార్పొరేషన్ అధికారులు ‘ఆపరేషన్ పిగ్ హంట్’ పేరిట సరికొత్త చర్యలు చేపట్టారు.
వీధుల్లో కనిపించే పందులపై కర్రలతో దాడి చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే చంపేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో టీడీపీ సీనియర్ నేత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) స్వయంగా పాలుపంచుకున్నారు. స్వయంగా ఈ బృందంతో పాటు పలు వార్డుల్లో పర్యటించి పందుల వేటలో యాక్టివ్ గా పాల్గొన్నారు. సంక్రాంతి వరకు ఈ ఆపరేషన్ పిగ్ హంట్ సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పందులను కర్రలతో కొట్టి చంపుతున్న దృశ్యాలు తెలుగు టీవీ చానెళ్లలో కలకలం రేపుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలే తప్ప మూగజీవాలను ఇంత దారుణంగా వెంటపడి మరీ చంపాలా?