ఎన్ని విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ నేతలు తమ వెకిలి చేష్టలతో వార్తల్లోకెక్కి విమర్శలపాలు కావటం మానట్లేదు. అధికార గర్వంతో తమ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బందితో చెప్పులు మోయించటం, బూట్లు తొడిగించుకోవటం లాంటి చర్యలకు పాల్పడి విమర్శల పాలైన ఘటనలు కోకోల్లలు. ఇక తానేం తక్కువ కాదంటూ ఇఫ్పుడు ఆ జాబితాలోకి చేరిపోయారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. తన చెప్పులను ఓ సీనియర్ నేతతో మోయించి విమర్శల పాలవుతున్నారు. ఇంతకీ ఈ యువరాజు గారి చెప్పులు మోసింది ఎవరో కాదు గతంలో కేంద్ర హోం శాఖ సహయ మంత్రి, ప్రస్తుతం పుదుచ్చేరి ఎంపీ గా ఉన్న వీ నారాయణస్వామిగారు.
అసలు విషయం ఏమిటంటే... మంగళవారం పుదుచ్చేరిలోని వరద ప్రాంతాల్లో రాహుల్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాకు చిక్కిన కొన్ని వీడియోల్లో రాహుల్ గాంధీ చెప్పులను నారాయణస్వామి మోసినట్లుగా చూపించారు. వీడియోలో, నారాయణ స్వామి చెప్పులు పట్టుకుని వాటిని రాహుల్ కాళ్ల ముందు పెట్టగా, ఆయన వాటిని వేసుకుని నడుస్తూ వెళ్లినట్టు కనిపిస్తోంది. . ప్రస్తుతం ఈ వీడియోల్లో సోషల్ మీడియాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఆ వార్తను నారాయణస్వామి ఖండించారు. రాహుల్ గాంధీ బూట్లు వేసుకుని వచ్చారని, నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, తన చెప్పులు ఇచ్చానని, అంతే తప్ప ఆయన చెప్పులు మోయలేదని చెప్పుకోచ్చారు. అయినా చెప్పులు మోసే సంస్కృతి లేదని కాంగ్రెస్ పార్టీలో నారాయణస్వామి అన్నారు. తన షూస్ ను కూడా రాహుల్ పట్టుకునే నడిచారని, కనీసం సెక్యూరిటీ గార్డులకు కూడా ఇవ్వలేదని వివరించారు. ఇక ఈ ఘటన తో మీడియాకు చిక్కిన రాహుల్ గాంధీపై విమర్శలు చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు అవకాశం దొరికనట్లయ్యింది.