హైదరాబాద్ లో కీలక నేత దానం నాగేందర్ కాంగ్రెస్ ని వీడి కారు (టీఆర్ఎస్) ఎక్కుతారనే వార్త గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తుంది. టీఆర్ఎస్ లో చేరేందుకు కాస్త క్లిష్టమైన డిమాండ్లను కేసీఆర్ ముందు ఉంచారని, అందుకే ఆయన చేరికను పెండింగ్ లో పెట్టారని కూడా మీడియాలో రావటం మనం చూస్తున్నదే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ పార్టీ ని వీడి గులాబీ కండువా కప్పుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఎంత లాగడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం కాంగ్రెస్ నే అట్టిపెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఏదైతేనేం చివరకు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు దానం.
ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు గొంతు విప్పారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలను తాను పట్టించుకోక పోవడం పొరపాటేనని ఒప్పేసుకున్నారు. ఇక పై ఎలాంటి తప్పులు చేయబోనని, ఇకపై పార్టీ కోసం సీరియస్ గా పని చేస్తానని చెప్పారు. ఇకపై గట్టగా పని చేస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీనియర్ నాయకులకు దానం హామీ ఇచ్చారు. 'సేవ్ హైదరాబాద్' నినాదంతో గ్రేటర్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నిలుస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడున్న ఆంధ్రుల హక్కులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ నేతగా తన భుజస్కంధాలపై వేసుకుంటానని దానం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దాదాపు చేరిక దాకా వెళ్లి వచ్చిన ఆయన మరి ఎన్నికల తర్వాతైనా ఫలితాల ఆదారంగా మనసు మార్చుకుంటారో వేచి చూడాలి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.