తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ వైపే. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగటం ఒక ఎత్తు అయితే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ఎత్తు. నిజానికి 2014 సాధారణ ఎన్నికల సమయంలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. రాష్ట్రానికి రాజధానిలోనే టీఆర్ఎస్ కు సరిపడా బలం లేకపోవటం, పైగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తగినంత బలం ఉండటం, వెరసి అధికార పక్షంలో ఇప్పుడు గుబులు పట్టుకుంది. ఈ పరిస్థితిలో గ్రేటర్ ఎన్నికలలో విజయం ద్వారా గతంలో జరిగిన పరాభవాల్ని మాయం చేసుకోవటంతోపాటు అధికార పక్షాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నది ప్రతిపక్షాల ఆలోచన. అందుకే గ్రేటర్‌కు అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది.
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే, వీటికోసం చాలా పట్టుదలతో సిద్ధపడుతున్నీఅధికార పక్షానికి, మూడు ప్రతిపక్షాలకు ఈ ఎలక్షన్ పెద్ద సవాలే. మరీ ముఖ్యంగా 2019నాటికి టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాగలమంటున్న బీజేపీ ఇప్పటికే రంగంలోకి దిగింది. అప్పట్లో కాంగ్రెస్-మజ్లిస్, ఇప్పుడు టీఆర్ఎస్-మజ్లిస్ మరోసారి గ్రేటర్ వాసులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఫ్లెక్సీలతో ప్రచారం మొదలుపెట్టింది. చిన్న చిన్న సభలు నిర్వహించి జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. మిత్రపక్షం టీడీపీతో కలిసి గులాబీ దండుపై విరుచుకుపడుతుంది. టీడీపీ, కాంగ్రెస్ ల పరిస్థితి కూడా అంతే.
ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటోంది. అధికారపక్షం కావటం, పైగా రాజధాని లో ఓడిపోతే పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉండటంతో చావో రేవో లాంటిది. కొత్త రాష్ట్రపు మొదటి ఎన్నికలో విజయం సాధించి రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీకి రాజధాని పురపాలనలో కీలక పాత్ర ఉంటే అధికారం సులువుతరం అవుతుంది. రాజకీయంగానూ ఎటువంటి కొరత ఉండదు. లేనిపక్షంలో అధికారం, రాజకీయం రెండూ కొరత పడతాయి. తనకు తొలినుంచి ఎక్కువబలం లేని హైదరాబాద్, రంగారెడ్డిల్లో పుంజు కోవాలనే ఆలోచన ఇక జన్మలో నెరవేరదు. ఆ కారణంతో రాజకీయంగా డిఫెన్సివ్ స్థితి కొనసాగుతుంది. స్వయంగా ఆధిక్యత సాధించటం, లేదా కనీసం కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకన్నా ఎక్కువ వార్డులు గెలవటం, స్వయంగానో లేక మజ్లిస్‌తో కలిసి మెజారిటీకి రావడం వంటివి జరిగాలి.
ఇక ఇక్కడ టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే... నగరంతో పాటు రంగారెడ్డి వాసులకు టిఆర్‌ఎస్‌పట్ల, అభివృద్ధి పట్ల దృష్టి మారటం అందుకు కారణాలు. సరిగా దీనినే ఆధారం చేసు కుంటూ ముమ్మరమైన అభివృద్ధి అజెండాతో, వాస్తవంగా కూడా అనేక పనుల అమలును వేగంగా చేపడుతూ, నగరంతోపాటు రంగారెడ్డి ప్రజలను మెప్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఈ గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుందనటంలో సందేహం లేదు. కానీ, ఇలాంటి వాటిలో అనుభవజ్నుడైన హరీష్ రావును కాదని కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పటం కాస్త కలవరపాటుకు గురిచేసేదే. తేడా వస్తే మాత్రం ఇక అంతే...