రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అలాగని మిత్రులు కూడా ఉండటం కష్టమే. ఏ టైంలో ఎవరు ఎలా మారేది ఎవరికీ అంతుబట్టదు. పార్టీ లో చేరినప్పటి నుంచి కుడి భుజంలా వెన్నుదన్నుగా నిలిచిన అనుచరుడే ప్రస్తుతం ఆ ముఖ్యమంత్రిపై దావా వేసేందుకు, అది కూడా ఏకంగా రూ.100 కోట్లకు సిద్ధమయ్యాడు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పై ఆయన మాజీ మంత్రి వర్గ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత హిమంత విశ్వకర్మ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని హిమంత స్వయంగా మీడియాకు వెల్లడించాడు.
గౌహతీలో ఆయన మీడియా తో మాట్లాడుతూ... శారదా చిట్ ఫండ్, లూయీ బెర్జర్ కుంభకోణాల్లో నాపై ముఖ్యమంత్రి తరుణ్ నిరాధార ఆరోపణలు చేస్తూ, నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక కూడా వాటిని ప్రచురించింది. వీరిద్దరి పై వందకోట్లకు అస్సాం ట్రిబ్యునల్ లో కేసు వేసినట్లు ప్రకటించాడు. గత కొద్దిరోజులుగా ఆయన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు, క్రిమినల్ కేసులు కూడా లేవు, ఆయన చేస్తున్నవన్నీ అర్థంలేని ఆరోపణలే అని హిమంత తెలిపారు. కాగా, 14 ఏళ్లపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహారించిన హేమంత విశ్వకర్మ తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో కూడా కీలక పాత్ర వ్యవహారించారు. ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. ఒకానోక టైంలో ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. కానీ, విభేదాలు ఆ ఇద్దరి మధ్య చిచ్చును రగిల్చాయి. దీంతో ఈ ఏడాది ఆగస్టులో తన సహచరవర్గంతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు విశ్వకర్మ. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.