ఒలంపిక్స్ కోసం గల్లా వర్సెస్ పవన్?

May 03, 2016 | 10:25 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Galla-Jayadev-vs-pavan-reddy-olympic-association-niharonline

ఏపీ ఒలింపిక్ సంఘంపై వివాదం సద్దుమణిగిందిలే అనుకుంటున్న తరుణంలో తాజాగా ఈ ఫైట్ లోకి మరోకరు దిగిపోయారు. తమదే నిజమైన ఒలింపిక్ సంఘమని ప్రకటిస్తూ పవన్ రెడ్డి ఏకంగా గల్లా జయదేవ్ ను ఢీకొట్టేందుకే సిద్ధపడ్డాడు. ఇతగాడు ఎవరో కాదు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు. గతంలో గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ల మధ్య పోరు రసదాయక పోరు సాగిన సంగతి తెలిసిందే. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించిన ఇరు వర్గాలు... తమ సంఘమే నిజమైనది అని ఓ వర్గం అంటే, కాదు తమదే నిజమైన సంఘమని మరోవర్గం మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో ఈ విషయం సర్దుమణిగింది అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా పవన్ ఎంట్రీతో మళ్లీ వివాదం రాజుకున్నట్లు అయ్యింది.

                              గల్లా జయదేవ్ నేతృత్వంలోని సంఘాన్నే అధికారిక సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ఉత్తర్వులను పవన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని పవన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలోనే పవన్ ఈ పిటిషన్ ను దాఖలు చేయటం విశేషం. ఈ పిటిషన్ లో గల్లా జయదేవ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ తో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని గల్లా జయదేవ్... ఏపీ ఒలింపిక్ సంఘాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఆధ్వర్యంలోని సంఘమే అసలైనదని కూడా పవన్ రెడ్డి వాదించారు. తమ సంఘంలోని సభ్యుడు పురుషోత్తం, మరికొందరితో కలిసి గల్లా జయదేవ్ కుట్ర పన్ని, తమ సంఘం పేరుతోనే మరో సంఘం ఏర్పాటు చేశారని పవన్ రెడ్డి ఆరోపించారు. రామచంద్రన్ కుమారుడు గల్లా జయదేవ్ కంపెనీల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారని, ఈ కారణంగానే జయదేవ్ కు రామచంద్రన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పిటిషన్ లో గల్లా జయదేవ్ తో పాటు పురుషోత్తం, రామచంద్రన్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి, శాప్ వీసీ, ఐఓఏ కార్యదర్శి తదితరులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ