దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల విధానాన్ని అమలు చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన వస్తు సేవల బిల్లు (జిఎస్టీ)కు అడ్డంకులు తొలిగే పరిస్థితి కనిపిస్తుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఐఆర్ఎస్ శిక్షణాధికారులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వస్తుసేవల పన్నుల బిల్లుకు అనుకూలంగా సభ్యులు ఓటు వేస్తారని అన్నారు. బడ్జెట్ సమావేశాలలోపు రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నామని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలు కీలకమైనవని, రాజ్యసభకు కొత్త సభ్యులు రానున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసంతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా, గత రెండు పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై సవరణలు కోరుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ దీనికి ఆమోదం తెలిపినప్పటికీ రాజ్యసభలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో ఎక్సైజ్, సర్వీస్, వ్యాట్, ఎంట్రీ, ఆక్ర్టాయ్, ఇతర రాష్ట్ర పన్నుల స్థానంలో ఒకే ఒక పన్నును విధించి పన్నుల వ్యవస్థలను సరళీకరించేందుకు మార్గం సుగమమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొన్నటిదాకా బిల్లులను పాస్ చేయించుకునేందుకు కాంగ్ వెంటపడ్డ బీజేపీ కి భంగపాటు తప్పదేమో అనిపిస్తోంది. కారణం సోనియా, రాహుల్ పైన నేషనల్ హెరాల్డ్ కేసు తవ్వటం. ఈ నేపథ్యంలో పెద్దల సభలో చర్చకు అడ్డుతలుగుతున్న వారు ఈ దఫా సహకరిస్తారనుకోవటం కాస్త డౌటే.