అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది.
రోజా సస్పెన్షన్, భవిష్యత్తు చర్యలపైన కాకుండా శాసనసభలోని వీడియో టేపులు బయటకు ఎలా వచ్చాయనే విషయంపై కూడా కమిటీ విచారణ జరుపుతోంది. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ సరిపోతుందా, ఇంకా కఠిమైన చర్యలు ఏమైనా తీసుకోవాలా అనే విషయంపై కమిటీ సిఫార్సు చేస్తుంది. అలాగే, రోజానే కాకుండా ఇంకా ఎవరైనా శాసనసభలో అనుచితంగా ప్రవర్తించారా అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. శీతాకాలం సమావేశాల్లో జరిగిన సంఘటనలపైనే కాకుండా వర్షాకాలం సమావేశాల్లో జరిగిన సంఘటనలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. వర్షాకాలం సమావేశాల్లో కూడా రోజా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై కూడా కమిటీ సూచనలు చేస్తుంది.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్ (టీడీపీ), గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైసీపీ), విష్ణుకుమార్ రాజు (బీజేపీ) ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేయనున్న కమిటీ 20 రోజుల్లోగా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నివేదిక అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా... రోజాపై సస్పెన్షన్ ను కొనసాగించాలా? లేక తగ్గించాలా? లేక మరింత కాలం పాటు పొడిగించాలా? అన్న దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.