ఇటీవల జమ్ము కశ్మీర్ లో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన వేర్పాటు వాది మసరత్ ఆలం భట్ ఆ దేశ అనుకూల నినాదాలు చేయటంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా కఠినంగా వ్యవహారించాలని హోంమంత్రి రాజ్ నాథ్ ఆదేశాలతో కదిలిన కశ్మీర్ ప్రభుత్వం ఆలంను అరెస్ట్ చేయించింది. తాజాగా ఇప్పుడు అతడిపై కఠినమైన ప్రజాభద్రతా చట్టాన్ని పోలీసులు అమలుచేశారు. ఈ చట్టం ద్వారా మసరత్ పై ఎలాంటి విచారణ జరగకుండానే కనీసం రెండు సంవత్సరాలపాటు జైల్లో ఉంటాడు. అంతేకాదు పీనల్ కోడ్ లోని 121ఏ, 124, 120బీ, 147 తదితర సెక్షన్లతోపాటు ఇంకా చిన్న చిన్న నేరాలను ఆలంపై మోపారు. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఆదేశాలను ఈ నెల 25 వరకు బుడ్గామ్ కోర్టు రిజర్వ్ లో ఉంచిన నేపథ్యంలో జమ్ము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.