పెటర్నిటీ లీవు పురుషులకు లభించే విరామం . భార్య గర్భవతిగా ఉన్న కీలకమైన టైంలో భర్త ఆమె పక్కనే ఉండి ఆమె బాగోగులు చూసుకోవాలన్నది దీని ఉద్దేశం. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆ మధ్య పెటర్నిటీ లీవు తీసుకుని దాని ప్రాధాన్యతను ప్రపంచమంతా చాటాడు. అలాంటి లీవును దుర్వినియోగం చేసి ఓ జపాన్ ఎంపీ పదవికే ఎసరు పెట్టుకున్నారు. భార్యతో కాకుండా ప్రియురాలి కోసం కేటాయించి, ఆపై విమర్శలు రావటంతో రాజీనామా చేశాడు.
జపాన్ లోని క్యోటో నియాజకవర్గ ఎంపీగా అయిన మియాజాకి (34) ప్రజాప్రతినిధుల్లో తొలిసారి పెటర్నటీ లీవు తీసుకున్నారు. దీనిపై మిగతా ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని షింజో అబే మాత్రం ఆయన్ను వెనకేసుకొచ్చాడు. పైగా ఆయన భార్య కూడా ఎంపీ కావటంతో వెంటనే ఆయనకు లీవు దొరికింది. జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి రెండు వారాలు ఆయన పెటర్నిటీ లీవుగా లభించింది. ఆయన భార్య ఫిబ్రవరి 4న బిడ్డకు జననం ఇచ్చింది. కానీ, దానికి కొన్ని గంటల ముందు క్యోటో నగరంలో జరిగిన వేడుకలో ఆయన ఓ బికినీ మోడల్ తో ప్రత్యక్షమయ్యారు.
ఈ సందర్భంలో ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను ఓ మ్యాగ్జైన్ ముఖ చిత్రంగా ప్రచురించింది. అంతే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.
దీనిపై ఆ ఎంపీ వివరణ ఇస్తూ... తాను చేసింది తప్పేనని, ప్రజలను మోసం చేసిన తనను క్షమించాలని ఆయన కోరారు. తనకు, ఆ మహిళకు మధ్య సాన్నిహిత్యం ఉందని ఆయన అంగీకరించారు. అయితే ఆ విషయం తన భార్యకు తెలుసని ఆయన వివరించారు. ప్రజా వ్యతిరేకత కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కాగా, దీనిపై ప్రధాని అబేగానీ, ఆయన భార్య కనికో గానీ, చివరికి ఆయన ప్రియురాలు కూడా స్పందించకపోవడం విశేషం.