ఇక నుంచి ఆఫీసు టైమింగ్స్ మిట్ట మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు.. ఖచ్ఛితంగా పాటించబడును. పర్వసానం... అగ్గిమీద గుగ్గిలం. వీరందరికీ సడన్ గా ఒక నాయకుడు జన్మించడం ప్రభుత్వానికి వార్నింగులు, ముట్టడి, దమ్ముంటే, అంతుచూస్తాం లాంటి గంభీర ప్రయోగాలు... కానీ, చంద్రుడు ముసిముసి నవ్వులు!
ఇక నుంచి సతీసహగమనం బాల్యవివాహాలు అమలు. పురుషులకి షష్ఠి పూర్తి తర్వాతనే వివాహార్హత! ఊరు హాహాకారాలు, ఆత్మాహుతులు, సెల్ ఫోన్ టవర్స్ ఎక్కి బెదిరింపులు... కందుకూరి, రాజారామ్మోహన్ రాయ్ వగైరాల వేషాధారణలతో అసెంబ్లీ ముట్టడి, ఉద్వేగభరిత ప్రసంగాలు, పాటలు, పద్యాలతో రాష్ట్రం అట్టుడికిపోవటం, కానీ, చంద్రుడు చల్లని చిరునవ్వులు! హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, చెస్టు ఆస్పత్రి లో సచివాలయం, సదరు ఆస్పత్రిని వికారబాద్ అడవులకు తరలింపు, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత, వందస్థుల సెక్రటేరియేట్ నిర్మాణం, ఇందిరా పార్కులో వినాయక నిమజ్జన సౌకర్యం, ఇక చివరరాఖరుగా గుడుంబాకు స్వస్తి. చీప్ లిక్కరుకు శ్రద్దాంజలి లాంటి ప్రకటనలు ఒక్కో ప్రకటనకు పలురకాల రియాక్షన్లు. కొసమెరుపుగా చీప్ లిక్కరు విషయంలో తూచ్ అంటూ ప్రస్తుత పరిస్థితులు, ప్రజాభిప్రాయం అనుకూలంగా లేనందున ప్రాజెక్టు ఎత్తివేయడమైందని ముక్తాయింపు. ఇట్టి మాదిరి ప్రకటనలు జారీచేసిన ప్రతీసారి దానికి ప్రతిధ్వనిగా జనించిన హడావుడి, తిరస్కార, ఆవేశకావేషాలు గమనించి,వినోదభరితంగా చిరునవ్వులు లగాయతు వికటాట్ట హాసాలు ఒలకించిన సూత్రధారి చంద్రుని చిలిపితనమేమని వర్ణించెదము!