ప్రతీ విషయంలోనూ సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు పోటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇది మంచి పరిణామమే. పోటీ పడి అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు ప్రగతిని సాధిస్తే అంతకన్నా ఏం కావాలి. కానీ, అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరే కాస్త చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక అంశంలో వెనుకబాటు తనం అనే సాకుని చూపుతూ భారీగా నిధులు రాబట్టాలని స్కెచ్ వేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం తెరమీదకు రావడంతో.. టీ సర్కార్ కూడా తమకూ కావాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా వెనకబడ్డ తెలంగాణకు భారీగా ఆర్థిక సహయం చేయాలని కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసారు. తెలంగాణలో నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను లేఖలో సవివరంగా పేర్కొన్నారు. తెలంగాణ వెనక బడింది అనడానికి స్వయంగా ప్లానింగ్ కమిషన్ ఆర్థిక కమిషన్ చెప్పిన విషయమే రుజువని ఆయన లేఖలో గుర్తుచేసారు.
విద్య, వైద్యం, విద్యుత్ వసతుల కల్పన, వ్యవసాయం, సాగు త్రాగు నీటి వనరులు వర్షాభావం కరువు వ్యక్తిగత ఆదాయం ఇలా తదితర అంశాల్లో వెనకబాటుతనాన్ని కులంకశంగా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని ఆయా రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. మరోవైపు అప్పుల పరిమితిని పెంచాలని కూడా టీ సర్కార్ కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రాలు తమ జాతీయ స్థూల ఉత్పత్తి- జీఎస్డీపీలో కేవలం 3 శాతం మాత్రమే అప్పులు తీసుకోవచ్చు. దీన్ని 3.5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్.
ఇలా ప్రతీ అంశంలో ఉన్న ఆర్థిక లోటును కేంద్రానికి అప్పజెప్పి భారీ మొత్తంలో ప్యాకేజీ రాబట్టాలని తెలంగాణ సర్కార్ పెద్ద ఫ్లాన్ వేసింది. మరి ఖచ్ఛితత్వం కోరుకునే కేంద్రం కేసీఆర్ డిమాండ్లకు తలొగ్గుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.