వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా... అలా అంటే అర్థం కాదుకదా. సినీ నటి రోజా... విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సూత్రం తెలీదు గానీ ఆత్రం ఎక్కువ అన్నట్లు తయారయ్యింది ఆమె పరిస్థితి. ఆఖరికి అసెంబ్లీలో ఉన్నానన్న సృహా మరిచి రోజా రోజూ నోరు జారుతోంది. తాజాగా అధికార పక్షం తెలుగు దేశం పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో వైఎస్సార్ ఫోటో తొలగింపు పై గత కొద్దిరోజులుగా వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఓ వారం క్రితం నగరి ఎమ్మెల్యే అయిన రోజా టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంచె కట్టు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలకు పంచె తడిసిపోతోంది.. అందుకే అసెంబ్లీలో ఆ మహా నేత ఫోటోను ఈ ప్రభుత్వం తొలగించింది.. వైఎస్ నవ్వుని చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలకు ఏడుపొస్తుంది..’అంటూ పంచ్‌లు పేల్చారు రోజా.
ఇక అసెంబ్లీ సమావేశాలను కూడా వేదిక చేసుకుని ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టు ముగారు. దీంతో ఆర్థిక మంత్రి యనమల వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం సభ 10 నిమిషాలు వాయిదా వేశారు. ఇక అసెంబ్లీ పాయింటు వద్ద రోజా మరోసారి నోరు పారేసుకున్నారు. వైఎస్ ఫోటో చూస్తే టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయని, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఫోటోను పెట్టడం ఇష్టం లేకనే వైఎస్ ఫోటోను కూడా తీసేశారని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలే విమర్శలు పెడర్థాలు తీసేదాకా పోతున్నాయి. విమర్శలు చేయాలి కానీ అవి శృతి మించకూడదు. వారు కూడా నోరు తెరిచారంటే పోయిదే ఆవిడగారి పరువే. అది అర్థం చేసుకుని మసలుకుంటే చాలా మంచిది.