తెలంగాణ లో ఓరుగల్లు ఉపఎన్నికల ప్రచారం మొదలయి గంటలు గడవక ముందే మాటలు వేడివేడిగా వడ్డించుకుంటున్నారు నేతలు. పాలనా ప్రామాణికంగా భావిస్తున్న అధికార పక్షం టీఆర్ఎస్ కి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. దీంతో ప్రత్యర్థులపై ముందు నుంచే విరుచుకుపడుతుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కీలకనేతలు హరీష్ రావు, మరో మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఐటీ మంత్రి కేటీఆర్ అందుకున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణను చెల్లని రూపాయితో పోల్చారాయన. హైదరాబాదులో చెల్లని రూపాయి వరంగల్ లో చెల్లుతుందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఆయన చేసిందేమీ లేదని. అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ గా పనిచేసిన సర్వేకి గత ఎన్నికల్లో ఏ అనుభవం ఎదురైందో, ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందని చెప్పారు. ఇక అదే సమయంలో బీజేపీ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడుతూ, 'డాలర్లకు ఓట్లు రాలవు' అన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎలాంటి బియ్యం తింటున్నారో... అలాంటి బియ్యాన్నే హాస్టళ్లలోని పేద విద్యార్థులకు కూడా పెడుతున్నామని తెలిపారు. పెద్దవాళ్లంతా కేసీఆర్ ను తమ పెద్ద కుమారుడిగా చూస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ గెలుపు ఖాయమని ఆయన చెప్పారు.