ప్రతిపక్షాలు ఉన్నదే ప్రభుత్వం చేసే లోటుపాట్లను ఎత్తి చూపటానికి. అయితే అధికారంలో ఉన్నవారికి అదే పార్టీ నుంచి విమర్శలు ఎదురవ్వటం కూడా అరుదుగా చూస్తుంటాం కదా. కానీ, ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కృష్ణయ్య ఇలా అంటే ఎవరికీ తెలీదు లేండి. బీసీ ఉద్యమ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య మనందరికీ సుపరిచితమే. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి తన స్థానంలో మాత్రం జయకేతనం ఎగరవేసి ప్రస్తుతం రాజకీయాల్లోనే కాదు, పార్టీలోనూ సుప్తావస్థలో ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో తనకు ప్రాధాన్యం లేదని బహిరంగంగానే ఆయన కామెంట్లు చేయటం మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఏపీ రాజకీయాలలో ఆయన జోక్యం చేసుకుంటున్నారు. తమ అధినేత చంద్రబాబుపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే రాజకీయ నేతగా మాత్రం కాదులేండి. ఉద్యమనేతగానే. బాబు వస్తే జాబు వస్తది అన్న నినాదం మరుగున పడిపోతుందని, అధికారంలోకి వచ్చాక బాబు ఒక్క జాబుకూడా ఇవ్వలేదని ఆయన విమర్శిస్తున్నారు. నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించాలని లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ఉద్యమిస్తానని చెబుతున్నాడు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయానికి వెళ్లి మరీ కృష్ణయ్య తమ అధినేతపై ఇలా విమర్శలు చేయటం టీటీడీపీలో ప్రస్తుతం కలకలం రేపుతుంది.
అయితే ప్రతిపక్షాలకు కూడా అందని పాయింట్ ను పట్టుకుని సొంత పార్టీని, పార్టీ అధినేత కృష్ణయ్యను దులిపేయటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిరేకెత్తిస్తుంది. జగన్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన కామెంట్లు చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. చూస్తుంటే పార్టీ నుంచి ఆయన జంప్ కావటం ఖాయంగా కనిపిస్తోంది.