కరుడుగట్టిన ఉగ్రవాది అఫ్జల్ గురుకి మద్దతుగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో విద్యార్థులు గత నెల 9 వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు నమోదు కాగా, నెలరోజుల జైలు శిక్ష అనంతరం ఈ మధ్యే విడుదలయ్యాడు. ఇక వచ్చి రాగానే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆజాదీ అంటూ పెద్ద పెద్ద మాటలే పేల్చాడు. ఓవైపు ప్రతిపక్షాలన్నీ కన్నయ్య స్పీచ్ లకు చప్పట్లు చరిస్తే, కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడంటూ అధికార పక్షం వాయించేసింది.
ఈ క్రమంలో మరోసారి అతడు చేసిన ఉపన్యాసం పెనుదుమారాన్ని రేపేలా ఉంది. భారత సైన్యంపై అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ మహిళలపై భారత సైనికులు అత్యాచార పరంపర సాగిస్తున్నారని అతడు ఆరోపించాడు. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులపై ఓ విద్యార్థి నేత అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.