తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే ప్రచారంతో పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తన ఆస్తులు రూ.113.73 కోట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి ఆస్తుల వివరాలను ప్రకటించారు. కేవలం 13.42 కోట్ల చరాస్తులు మాత్రమే ఉన్నాయని ప్రకటించడం విశేషం. ఇక స్థిరాస్తులు అసలు ఆయనకు లేవంట. తనకున్న ఆస్తులు తన భార్యలు దయాళు అమ్మాళ్, రాజాత్తి అమ్మాళ్‌లు మాత్రమేనని పేర్కొన్నారాయన. అయితే, ఆ ఇద్దరు భార్యల ఆస్తులు రూ.62.99 కోట్లుగా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా తన ఆస్తుల వివరాలపై ఇదే విధంగా స్పందించారు. అప్పడు తన భార్యల ఆస్తుల విలువ రూ.41.13 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే వారసుల ఆస్తులతోపాటు, విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీతోసహా అన్ని వివరాలు బయటపెట్టాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు.